Our Sacred Story | Ashrama Guru Parama Guru sri sidda datta avadoota swami

సద్గురు శ్రీశ్రీ కృష్ణపరమహంసస్వామి శిష్యులు,దుర్గా ప్రసాద్ దేవర

సద్గురు శ్రీశ్రీ కృష్ణపరమహంసస్వామి శిష్యులు,దుర్గా ప్రసాద్ దేవర వారి జీవిత విశేషాలు. (వారు రచించిన కరుణాంమృతసాగర పుస్తకంనుండి గ్రహించటమైనది)

ముక్తాగుచ్ఛసూత్ర త్రయక్షర ప్రవరాన్విత శికారబీజ, తేజస్తత్వ వీరశైవ జంగమ వంశ వృషభగోత్రికులు శివశ్రీ వెంకటరమణ, మల్లికాంబ దంపతులకు శివ అంశతో 1953, విజయనామసంవత్సరం శ్రావణమాసం, శతభిషానక్షత్రంలో జయవారంనాడు శుభజననం. 1953లో గోదావరి వరదల కారణంగా రాజమండ్రి నుండి గుంటూరు వెళ్ళినపుడు మార్గమధ్యంలో కృష్ణనదీతీర విజయవాడ పుణ్యక్షేత్రంలో రైల్వే ఆసుపత్రినందు శ్రీదుర్గా మాత వర ప్రసాదంగా ఈ దంపతులకు కలిగిన ప్రథమ పుత్రులు, సత్యదుర్గ వరప్రసాద్. చిన్న నాటి నుండి అనేక కష్ట నష్టాలు అనుభవిస్తూ శ్రీ కనక దుర్గా మాతనే తన తల్లి తండ్రి గురువు దైవంగా భావిస్తూ అమ్మ అనే దివ్య నామ మంత్రంతో అమ్మవారి చరణాలను నమ్మి గడుపుతూ 12సం||ల వయస్సు నుండి గురు అన్వేషణతో పరితపిస్తూ 18వ ఏటలో దేవి భాగవతం చదివి అందులో శుక మహర్షి,మరియు వ్యాసులవారి సంవాదము మరియు జనక మహారాజు వారి రాజయోగ గృహస్థ సన్యాసధర్మాలు చదివి ఆ నాడు నాకు కలిగిన పరిమితి జ్ఞానంతో అయిష్టంగా గృహస్త జీవనానికి అంగీకరించి 1974-02-27 తేదీ గృహస్త జీవనం అమ్మవారి అనుగ్రహ ప్రేరణ సందేశముతో మల్లేశ్వర గ్రామంలో వివాహము జరిగింది. 1980-11 నెల కార్తీకమాసంలో శతభిష నక్షత్రం రోజున తల్లిదండ్రులను వ్యాపారం భార్య అన్నీ విడిచి ఆవేదనతో దైవ అన్వేషణలో గురు అన్వేషణలో విజయవాడ దుర్గా దేవి,  తిరుపతి వెంకటేశ్వరస్వామిని, తమిళనాడు ఫలని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి దివ్యానుభూతితో ఫలనికి దగ్గరలొ తమిళనాడు చివరలో పలాచ్చి అను గ్రామంలో కొన్ని దినాలు నివసించినపుడు రాత్రీయందు 12 గంటలకు 2 గంటలకు మధ్య కాలంలో ఏదో దివ్యనాదం వినబడేది. ఆనాదం ఆనాటినుండి ఈ నాటివరకు వినుచూనే ఉన్నాను చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది.

కేరళ రాష్ట్రంలో పాలఘాట్ జిల్లాలో తిరిగి అక్కడక్కడా ఆలయాలు దర్శించి అలా తిరుగుతూ రామేశ్వరం, పుదుక్కోటై, కోయంబత్తూర్, కరూర్,కడలి, గురువాయూరు, శబరిమలై, త్రీవేండ్రం, బెంగళూరు, నాగర్ కోయిల్, పాండురంగాలయం శ్రీరంగం, తీరుచునాపల్లి, చందూర్ సుబ్రహ్మణ్యం, కన్యాకుమారి, శ్రీ మధుర మీనాక్షి, మధురై క్షేత్రాలు తిరుగుతూ 1981 జనవరి 14వ తేదీ సంక్రాంతి పర్వదినము మల్లేశ్వర గ్రామం చెరితిని. ఇచ్చట గోదావరి నదిలో ప్రతీరోజు స్నానం చేసి గోదావరి లంక ఇసుకతిన్నెలలో నా బుద్ధికి తోచిన విధంగా ప్రాణామాయం యోగాసనములు, జప అనుష్టానము చేసేవాడిని. అనంతరం గ్రామములోనికి వస్తున్నప్పుడు నదీ తీరాన ఉన్న ఆశ్రమములో మద్గురువులు శ్రీశ్రీ కృష్ణ పరంహంస స్వామివారు నన్ను గమనించే వారు. కానీ నేను వారిని గమనించలేదు, అలా 1982-11 నెల కార్తీక మాసం శతభిషం నక్షత్రం రోజున అక్కడ ఉన్న గ్రామదేవత మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలూ నేను నా మిత్రులు కలిసి సాధనలు చేయుచుండగా ప్రధమము ఓంకార నాదాన్ని గానము చేయుట అలవాటుగా 5సార్లు ఓంకారాన్ని చేసేసరికి, ఆ రాత్రి 8గం||సమయానికి శ్రీశ్రీ కృష్ణపరమహంస వారు వారి ఆశ్రమమునుండి లేచివచ్చి ఇప్పుడు ఎవరు ఓంకారాన్ని గానం చేశారు అని అడిగి నన్ను తీసుకుని ఎంతో సంబరపడుతూ స్వామివారు నన్ను అనుగ్రహించి,మయూర ఆసనమును ఎంతో సునాయసముగా ప్రదర్శించి ఇంకా ఎన్నో నీకు భోధిస్తాను,అప్పుడప్పుడు ఆశ్రమానికి రమ్మని ప్రేమతో ఆహ్వానించారు.అది మొదలు స్వామి వారి సన్నిధికి తరచూ వెళ్ళే వాడిని.స్వామి వారు ఎంతో ప్రేమతో చేరదీస్తు ఎన్నో భక్తి విషయాలు చెబుతూ నన్ను నా గతజన్మ కర్మలను నా మనోబుద్ధినీ పరిక్షిస్తూ, శ్రీశ్రీ కృష్ణ పరమహంస వారు నన్ను అనుగ్రహించేవారు. కానీ నేను మాత్రం అహంకారం వలన మరియు పుణ్యము ఆనే బంగారు సంకెళ్ళు భిగించుకొని, పాపం ఈ పెద్దవారికి ఎవరూ లేరు వారికి సేవ చేయుట మంచిది అని వారిని నా మనస్సుకు నచ్చిన విధంగా సేవించేవాడిని, సాధుదర్శనం పాపనాశనం. సాధుసేవ పుణ్యము.సాధు సంభాషణ కోటి తీర్ధముల సేవన ఫలము.సాధు పాద నమస్కారము మోక్షం ఇస్తుంది. గంగా దాహం తీరుస్తుంది,కల్పవృక్షం నీడనిస్తుంది. కామధేనువు ఆకలిని తీరుస్తుంది. సాధువులు సత్పురుషులు మాత్రం ఆకలి తీరుస్తారు దాహమూనూ తీరుస్తారు. శాంతిని ప్రసాదిస్తారు, మోక్షాన్నీ ప్రసాదిస్తారు. అట్లాంటి సాధు సాంగత్య సేవా ఫలం ఎన్నోజన్మల పుణ్యఫలం కోట్లకొలది చేసి ఉంటేనేగాని లభించనిది అట్లాంటి సాధు సేవా భాగ్యం ఈ దీనుని,ఈ ఇసకరేణువుని, ఈ గడ్డి పరకను వెతుక్కుంటూ వచ్చి తన దివ్యప్రేమ కరుణామృతాన్ని వర్షింపచేస్తూ తన ఒడిలోకి చేరదీసుకుని వజ్రాయుధంగా, మానిక్యంగా ఈ ఇసుక రేణువుని కడసారి బిడ్డని లెక్కింపదగని వానిని ఆనాటి నుండి ఈనాడు ఈ స్థాయికి అనగా సత్య దుర్గా వరప్రసాద్ అనే మాంసపిండాన్ని సంసార సాగరంలో మునిగిపోతున్న వాడిని సద్గురు శ్రీశ్రీ కృష్ణ పరమహంసవారు ఏడు సం||ల కఠినాతి కఠిన పరీక్షలతో రాపిడి చేసిచేసీ దుర్గా ప్రకాష్ దేవరగా (శ్రీసిద్ధదత్త అవధూతగా) వజ్రకాంతితో వజ్రాయుధంగా తయారు చేసి తనకు అనగా శ్రీశ్రీ కృష్ణపరమహంస స్వామి వారికి పోయే ప్రాణాన్ని శిష్యుని కొరకు 12సం|| ప్రాణం నిలుపుదల చేసుకుని ఈ లోకంలో ఈ కడసారి శిష్యున్ని పరిచయం చేస్తూ నాలో నిద్రాణమై యున్న దివ్య చైతన్య శక్తులను మేలుకొలుపు చేసి అనేక మంత్ర సాధనాలు, యోగ సాధనలు చేయించి నా జన్మకర్మలను భస్మంచేసి పరిశుద్ధుని చేసి ఈనాడు అఖండ దీపసన్నిధి, శ్రీపాదుకా, శ్రీ స్కంధ ప్రతిష్ట, శ్రీలలిత త్రిశక్తి ప్రతిష్ఠించి శ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామి సేవాసమితి శారదా శ్రీవిద్యా పీఠాధిపతి శ్రీశివయోగి సిద్ధ దత్త అవధూత అవడము శ్రీసద్గురు కరుణామృతసాగరమే. ఈ దేహము ఉన్నంత కాలము దైవప్రచారము చేస్తూ గురువు చెప్పిన కుండలినీ సాధనను,స్వర శాస్త్రాన్ని భక్తులకు శిష్యులకు ఉపదేశిస్తూ ఈ కాలమందు భార్య బిడ్డలను విడచి కాషాయము ధరించి కందమూలాలు తింటూ అడవులకు పోవు పనిలేకుండా మీ గృహాన్ని ఆశ్రమముగా ఆలయంగా చేయవచ్చు అని అందరికీ తెలియ పరుచుట కొరకు ఈ అఖండ జ్యోతి ద్వారా అనేక జ్యోతులు ప్రతీ ఇంటా వెలగాలని ప్రతీ ఇంటా స్వయంసేవాసత్సంగాలు చేయాలని ప్రతి ఒక్కరూ రాజయోగులై నిత్యానందంగా జీవించాలని శ్రీశ్రీ కృష్ణపరమహంస స్వాముల వారు చెప్పిన యోగసాధనలు ఒక చిన్న పుస్తకము ద్వారా గురువు గొప్పదనం అంధరికి తెలుస్తుందని “కరుణ అమృత సాగర” అనే పేరుతో శ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామివారు చెప్పిన యోగసాధన రహస్యములు వారు చెప్పినవి మాత్రం వ్రాయుట జరిగింది. మరియు నేను చదువరిని కాదు, రచయితను అసలే కాదు, కవిని కూడా కాదు, గురువు చెప్పినవి నమ్మి శ్రద్ధా పట్టుదలతో సాధన చేయటమే కర్తవ్యము జీవించు వాడను. ఇందలి విషయములకు ఆధారం నా గురువుగారు ఉపదేశమే ఆధారం. ప్రమాణం నా జీవిత అనుభవమే ప్రమాణం. అందు అక్షర దూషము గాని, పదముల దూషములు గాని నా గురువుది ఎంత మాత్రము కాదు, నాది మాత్రమే.