Our Sacred Story | Ashrama Guru Parama Guru Sri sri sri Krishna Paramahamsa Swami

పరమ గురు శ్రీ శ్రీ కృష్ణపరమహంసస్వామి

శ్రీ శ్రీ కృష్ణపరమహంసస్వామి కేరళ రాష్ట్రంలో పాల్ ఘాట్ జిల్లాలో ముండూరు గ్రామంలో శ్రీరాఘవమీనన్ జానకీదేవిల గర్భఫలంగా ఉదయించి 6వ ఏట వారినుండి తప్పిపోయి,మధుర చేరుకుని మధుర మీనాక్షిదేవి ఆలయ అర్చకుల పోషణలో పెరిగి 14వ ఏట సన్యసించి 16వ ఏట తీర్ధయాత్రాసక్తులై వేదభూమి,ధర్మభూమి,కర్మభూమి ఐన యావద్భారత దేశం మూడు సార్లు ప్రదక్షిణ చేసారు. యావత్ ప్రపంచ మహాసభలలో ఘనంగా సన్మానించబడిన మరియు శ్రీరామకృష్ణ పరమహంసస్వామి ప్రధాన ప్రియశిష్యులు “శ్రీ స్వామి వివేకానందను”,శ్రీరామనాధపురం మహారాజావారి బంగారురధం,ఐదుగురు చక్రవర్తులను దర్శించారు. వారిలో ఇద్దరు చక్రవర్తులు ఆశ్రమం కట్టించి రాజ్యంలో ఉండమని స్వామివారిని కోరారు, స్వామివారికి స్వతంత్రేచ్ఛ,యాత్రాసక్తి ఉండడం వలన స్వామి ఆశ్రమవాసన్ని అంగీకరించలేదు. అయితే ఒకానొక సంధర్భంలో స్వామి ఒక భైరాగిని చూశారు.

ప్రతిమనిషిలోనూ,చెట్టులోనూ,పుట్టలోనూ,దైవాన్నే వీక్షించే ఆ భైరాగి స్వభావం “ఎక్కడో తీర్ధాక్షేత్రాలలో మాత్రమే దేవుడు ఉన్నాడు” అనుకునే స్వామి అభిప్రాయాన్ని మార్చి వేసింది. ఈ సృష్టి సర్వమునందు వ్యాపించి వున్న సృష్టికర్త(దైవము)ను చూడగలగాలి,అజ్ఞానులైన మూఢులకు మనకు తెలిసిన జ్ఞానమును అందించాలి అనే అభిప్రాయము కలిగినది.

పవిత్ర వశిష్ట గోదావరి తీరం అందు సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీ కపిలా మహర్షి ప్రతిష్ఠ చేసిన శ్రీ కపిల మల్లేశ్వరస్వామి ఆలయం,స్నానం,ధ్యాన,పూజ,గాయత్రి జప,నిష్టులైన పండితులున్న “మల్లేశ్వరం” స్వామిని ఎంతగానో ఆకర్షించింది. స్వామి మల్లేశ్వరం గ్రామంలో స్థిరపడినారు.

జీవాత్మ పరమాత్మ అని రెండు దీపాలని వెలిగించి తాను తిన్నా తినకున్న ఆ దీపాలను ఆరాధిస్తూ ఆశ్రితులకు అజ్ఞానతిమిరాన్ని పోగొట్టే జ్ఞాన జ్యోతిగా ప్రకాశించారు.

శ్రీ స్వామికి దైవకార్యములనిన మిక్కిలి ప్రియము.ప్రతి సంవత్సరమూ చాతుర్మాస ఆరంభదినము పూజకు అన్నీ సమకూర్చటం,ఆకలి సమయానికి భోజనం పెట్టటం ఇలాంటి సేవల ద్వారా మమతానురాగలు పెరగటం సహజం.ఈ గ్రామంలో ఇంత మంది జనం ఉండగా వారికి సేవ చేయటం నా వ్యక్తిధర్మం అనే భావనా స్వామికి కలుగుతుంధి.ఇలా వీరికి ఈ ఊరు పట్ల ప్రత్యేకమైన ఆదరభావం ఏర్పడింది.

స్వామి భక్తుల అభీష్టసిధ్ది కొరకు అరవన చక్రం వేయించి కృతిక పూజలు చేసేవారు(నేటికీ ఆశ్రమంలో 425 పైచిలుకు కృత్తికా నక్షత్ర పూజోపాసనలు కొనసాగుచున్నవి).ఎందరో వందలది భక్తులు స్వామిని ఆశ్రయించి అభీష్టసిద్ధిని పొందారు.

కృత్తికారాధనకు వచ్చే భక్తులందరకు అన్నసమారాధన కూడా చేసేవారు భగవంతునికి భక్తునికి భేదం లేధు.భక్తుడు ఉన్న చోట భగవంతుడు, భగవంతుడు ఉన్నచోట భక్తుడు ఎప్పుడు ఉంటారు.స్వామికి దేవతలందరిపట్ల భక్తిభావం వున్నా శివనందనుడు అయిన కుమారస్వామిపట్ల ఒక పాలు భక్తి ఎక్కువ.

నిశితంగా పరిశీలిస్తే శ్రీకృష్ణపరమహంస స్వామియే కుమారస్వామి.ఆశ్రితుల ఆవేదన బాపి ఆనంద సుధను అందించుటకు ఇలా రూపుదాల్చి వచ్చినారనే సత్యం మనకు బోధపడుతుంది.ఆరు ముఖాల స్వామి కుమారస్వామి. మనస్వామి ఆరు సంవత్సరముల ప్రాయంలో కన్నవారిని వీడి “నేను ఈ భువిలోకి వచ్చినది కన్నవారికి మాత్రమే బిడ్డనై కడుపున పుట్టిన వారికి మాత్రమే తండ్రినై సామాన్య జీవితం గడుపుటకు కాదు,ఆశ్రయులకు కల్పవృక్షమునై దివ్యవరములనిచ్చు దేవతామూర్తిగా నిండుగా వర్ధిల్లుటకు అనే సత్యాన్ని వ్యక్తం చేశారు.

నిజజనని,జగజ్జనని అయిన శ్రీమధుర మీనాక్షిదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి దివ్యశక్తిని పొంది త్యాగానికి చిహ్నంగా సన్యసించారు.పాలలోని నీళ్ళను వేరుచేసి పాలను మాత్రమే తీసుకొను హంసలా – ఆజ్ఞానాన్ని సుజ్ఞానములతో నిభిడీకృతమై వున్న ఈ ప్రకృతిలో – ఆజ్ఞానాన్ని పారద్రోలి,సుజ్ఞానం అనే వెలుగు తనలో నిలుపుకొని దివ్యత్వంతో ప్రకాశిస్తూ ఆ వెలుగును ఆశ్రితులకు అందిస్తూ పరమహంస అయినారు.(తాను సదా వెలుగును ఆస్వాదిస్తూ ఆ వెలుగును లోకాలకు అందించేవారే పరమహంసలు శ్రీశ్రీ కృష్ణ పరమహంసస్వామి కూడా ఇలాంటి మహానుభావులలో ఒకరు).

అంతేకాక శ్రీశ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామి జన్మించింది కార్తీక మాసం శతభిష నక్షత్రంలో కార్తీకమాస అధిదైవతం కుమారస్వామి కృతిక నక్షత్రోదాయాన్ని బట్టి ఈ మాసానికి కార్తీక మాసమని పేరు వచ్చింది.శివ ప్రీతికరమైనది కార్తీకమాసం. ఎక్కడి కేరళ?ఎక్కడి ముండూరు?ఎక్కడి మల్లేశ్వరం?.శ్రీశ్రీశ్రీకృష్ణ పరమహంసస్వామి రెండు వందల సంవత్సరాలు జీవించారని కొందరి భక్తుల నమ్మకం.త్రైలింగస్వామిని గూర్చి కూడా ఇధే విధంగా చెబుతారు.ఇంటినుంచి ఎంధుకు తప్పిపోయాడో ఎలా తప్పిపోయాడో ఆ తర్వాతనైన తల్లిదండ్రులు వెతికి కనుక్కునే ప్రయత్నం ఎందుకు చేయలేదో అంతా విస్మయకరం.అంతే కాదు మధుర మీనాక్షి దేవాలయ అర్చకులు ఆ శిశువును చేరదీయడం ఆ ముగ్ధుడు మీనాక్షి అమ్మవారి సన్నిధిలో పెరగడం మరింత విస్మయకరం.

శ్రీశ్రీకృష్ణ ప్రమహంస స్వామి జన్మసంవత్సరం తెలుసుకునే ఆధారాలు లేవు,మాసమూ నక్షత్రమూ మాత్రం తెలుసు. ఆయన ఇంట్లోంచి అతి చిన్నవాడిగానే వెళ్ళిపోయి మధుర మీనాక్షి సన్నిధి చేరడమే ఆధ్యాత్మిక మహాపురుషుల చరిత్రలో కనీవినీ ఎరుగనిది. ఆరేళ్ళ వయసున్న పిల్లలతో ఆడుకోవటానికి ఇల్లు వదిలాడు,వాళ్ళతో ఆడి పాడి ఇంటినుంచి తప్పించుకోవటానికి పరుగులు తీశాడు. తన నేస్తాలు తనను తరుముతున్నారేమో అని శంకించాడు. పరుగుపరుగున ముండూరు రైల్వేస్టేషన్ చేరాడు.అమాయకంగా రైలెక్కడు. మధుర స్టేషన్లో ఆయన్ని అధికారులు రైలు దింపారు. మధుర మీనాక్షి అమ్మవారి సన్నిధికి చేరడంలోనే ఆయన భవిష్యజీవిత నిర్ధారణ ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన నిష్ఠగా ధ్యానంలో ఉన్నారు పరవశిస్తూ,అమ్మవారి అర్చకులు అంతా చిన్నపిల్లాడిని చూసి ఆ పిల్లవాడి భక్తికి అబ్బురపడి ఇంటికి తీసుకుని వెళ్ళారు. కాని అర్చకుడు ఆలయం లో ఉన్నప్పుడల్లా ఆ శిశువు ఆయనవెంట ఉండేవాడు. రోజూ ఆలయానికి క్రమం తప్పకుండా వచ్చి అమ్మవారిని అర్చించే కాత్యాయనీ దేవి అనే భక్తురాలు ఆ పిల్లవాడ్ని చూస్తూ ఎంతో విస్మయం చెందేది. దైవభావనలో విహరించేది. ఇంతలో అమ్మవారి అర్చకుడు మరణించడంతో పిల్లవాడు నిరాశ్రితుడైనాడు. కాత్యాయని దేవి అతనిపై కరుణతో స్థానిక శృంగేరి మఠస్వాములైన శ్రీకృపానంద స్వామి వద్దకు ఆ పిల్లవాడిని అర్పించింది. అక్కడే ఆయన పదేళ్ళు పెరిగాడు.కృపానంద స్వామి పరివేక్షణలో విద్య నేర్చాడు.కాత్యాయనీదేవి కనిపెట్టిఉంది,బాలుడి అసలు పేరు కృష్ణ మీనన్. కృష్ణ మీనన్ కృపానందస్వామితో ఒకసారి పళనిలో స్వామి ఉత్సవానికి వెళ్ళాడు.

స్కంధస్వామి సన్నిధిలో తన పదహారవయేట ఆయన సన్యసించాడు. కృపానందస్వామి ఆ తరుణసన్యాసికి శ్రీశ్రీకృష్ణపరమహంస అనే దీక్షా నామాన్ని ప్రసాదించారు. నిజంగానే ఆయన పరమహంస,పాలనుంచి నీటిని అలవోకగా వేరుచేశారు. తాను ఎలాగో సన్యసించాడు గనుక తనకు బంధమేముంది?ఒకసారి కన్న తల్లిని పుట్టిన ఊరిని చూడాలనిపించి ముండూరు వెళ్లారు. ఆ ముచ్చటా తీరింది. మళ్ళీ మధుర వచ్చారు స్వామి కాత్యాయనీదేవి ఆదరించింది. ఇక దేశాటన,తీర్ధయాత్రలపై ఆయన బుద్ధి పోయింది. ఓడ వర్తకుడైన చిట్టియార్ మలయా(మలేషియా) వస్తారా స్వామి అని అర్ధించాడు. ఆ ఓడలో మలయా వెళ్లారు స్వామి.కౌలాలంపూర్ లో స్కంద దేవాలయం ఉంది. ఆయన్ను ఉపాసించారు పరమహంస. ఆయనకు ఆహారం లభించకపోతే స్వామివారి ప్రసాదం ఆయనకు దక్కింది. దానితో పరమహంస దివ్యజ్ఞాన సంపన్నులైనారు. ఆ తర్వాత సింగపూర్లో కొన్నాళ్లున్నారు. ఒక మౌల్వీ ఆయన్ను తమ మతంలోకి రావాలని ఆహ్వానించాడు కానీ అన్నిమతాలు మావే అన్నారు పరామహంస స్వామి. కాలినడకన అక్కడినుండి బర్మా చేరారు. సరిగ్గా అప్పుడే స్వామి వివేకానంద రామనాధపురం వస్తున్న విషయం తెలిసి శ్రీశ్రీకృష్ణ పరమహంస స్వామి అక్కడికి చేరుకున్నారు. ఆ వివేకానంద సత్కార దృశ్యం తిలకించారు.

ఆ తరువాత శ్రీరంగం వెళ్లారు. మధురైమీద మమకారం ఆయనను నిలువనివ్వలేదు. మళ్ళీ మధుర చేరారు. మధుర నుంచి ఫళని 45మైళ్లు. అది తన క్షేత్రం. తాను క్షేత్రజ్ఞుడు. మధుర నుంచి రోజూ కాలినడకన స్వామి పళని వెళ్ళి వచ్చేవారు. అమ్మను చూడకుండా ఉండలేరు. కుమారస్వామిని దర్శించకుండా వుండలేరు. ఇలా ఎన్నో ఆవృత్తాలు జరిగాయి. ఆయనకు ఉత్తరభారత యాత్రలు చేయాలని బుద్ధిపుట్టింది.ప్రయాగ వెళ్లారు. అక్కడ రామాయణం గురించి ప్రసంగిస్తూ పారవశ్యలీనమై సమాధి స్థితిలోకి వెళ్లారు. అక్కడి నుంచి కాశీ వెళ్లారు. హృషీకేశంలో కొన్నాళ్లు గడిపారు. మళ్ళీ ఆయన కర్ణాటక పుణ్యక్షేత్రాలని దర్శించటానికి వచ్చారు. శృంగేరిలో నృసింహభారతి వారు శ్రీశ్రీకృష్ణపరమహంసస్వామిని ఆదరించి భిక్ష ఏర్పాటు చేశారు. అక్కడినుంచి ఆయన రమణాశ్రమం దర్శించారు. సంవత్సరం తరువాత శ్రీకాలహస్తి వెళ్ళి మలయాలస్వామిని చూశారు. అక్కడినుంచి నాసిక్ త్రయంబకం వెళ్లారు గోదావరి పుష్కరాలకు. కన్యాకుమారి వెళ్ళారు,అక్కడినుంచి రాజమహేంద్రవరం వచ్చారు. చివరకు మల్లేశ్వరం లో స్థిరంగా చాలా ఏళ్లున్నారు. శ్రీశ్రీకృష్ణ పరమహంస స్వామి ఒడిలోంచి పాములు జరజరా పాకిపోయేవి. ఆయనకు అఖండ దీపం అంటే ఎంతో ఇష్టం. దానికోసం నూనెను అందరిని అర్ధించేవారు. షిరిడి సాయి బాబాకి రాత్రంతా దీపాలు వెలగాలని కోరుకునేవారు కదా! ఆద్యాత్మిక దివ్య జీవనులు దీపాలు వెలిగిస్తూనే వుంటారు. అందులో అన్నీ అఖండ దీపాలు. కేరళ ముండూరులో పుట్టి ఆంధ్రదేశంలో కపిలా మల్లేశ్వరంలో ఇంకా వెలుగు ప్రసాదిస్తున్నవి ఈ అఖండదీపములు.

స్వామివారి మండల ఆరాధనలో సౌగంధికాపేటికలో నవరత్న ఖచిత స్వర్ణ అరవన యంత్ర చక్ర ప్రతిష్ఠతో భద్రపరచి స్వామి వారి ఇష్ట దేవతకు,జగన్మాతకు స్వామి వారి అనుగ్రహంతో,వారు నిర్ధేశించిన విధముగా విశేషమహూత్సవాలు నిరంతరము జరుగుచున్నవి.

స్వామి చెప్పిన యోగ సాధన విధానముగా సం||లో 5 రోజులు శ్రీ పాదుకాదీక్ష భక్తులకు ఉపదేశించుట 3 నెలలకు దీక్ష పొందిన వారికి సాధన తరగతులు నడుపుట,ఆధ్యాత్మిక ప్రచారము,శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణము చేయుట,శ్రీరామ ఏకాహం,సప్తాహములు,సప్త సప్తాహములు,అన్నదానములు,లలితా యాగములు చేయుట ఆంధ్రప్రదేశ్లో లోకకళ్యాణర్ధం మల్లేశ్వరం గ్రామం నుండి వెల్లడైయినది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణంలో పాల్గొనిన వివాహం కానీ యువతీ,యువకులకు వివాహం జరుగును. సంతానం లేని వారికి సంతానం కలుగును.భక్తుల మనోవాంఛితములు నెరవేరుచున్నవి శ్రీస్వామి వారి అనుగ్రహంతో జరుగుచున్నవి

శ్రీశ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామివారు పుష్యశుద్ధ పోర్ణమి సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారి కళ్యాణ పర్వదినం 1996 జనవరి ది.5న మహాసమాధి పొందారు.అనంతరం 40రోజుల మండలారాధన చేయులోపులో అనేక మంది స్వార్ధపరుల,పోరుగూరు భక్తులపై శిష్యునిపై ఒత్తిడి తెచ్చినారు. గురు అనుగ్రహంతో దుర్గా ప్రకాష్ దేవరగారికి వివేకానందుని దివ్య సందేశం గుర్తుకువచ్చింది. శ్రీరామకృష్ణ పరమహంస స్వామి దేహం చాలించినపుడు సన్యాసి భక్తులకు,గృహస్థ భక్తులకు సన్యాస భక్తులేనా గురుదేవులను పూజించేది మేము గురుదేవుని పూజించాలనే విషయంలో తర్కం వచ్చింది. వివేకానంద స్వామి సమయ స్పూర్తితో అర్ధరాత్రి స్వామి శిరస్సువద్ద ,హృదయం వద్ద,హస్తాల వద్ద,పాదాల వద్ద ఉన్న ఆస్తికలను సన్యాస భక్తులకు ఇచ్చెను.మరునాడు మిగిలిన ఆస్తికలను గృహస్థ భక్తులకు ఇచ్చేను.అదే స్పూర్తితో దుర్గా ప్రకాష్ దేవరగారు స్వామి శిరస్సువద్ద ,హృదయం వద్ద,హస్తాల వద్ద,పాదాల వద్ద ఉన్న ఆస్తికలను సౌగంధి కాపెటీకలో రహశ్యాంగా భద్రపరచి గ్రామ ప్రజల సమక్షంలో, గ్రామ ప్రజల కోరిక మేరకు పవిత్ర గోదావరి నదిలో నిక్షిప్తం చేసినారు. శ్రీగురుపాదుకలను స్వామి దివ్యాచైతన్యంతో,అమృత హస్తములతో ప్రతిష్ఠించినారు. శ్రీ స్వామివారు ఆదేశించిన విధంగా 82సం||రాల అఖండ నందా-దీపసన్నిధిలో స్వామి అనుగ్రహముతో,స్వాముల వారి ఆశ్రమంలో చేసిన కార్యక్రమాలు ,ఉత్సవాలు ఈరోజువరకు యదాతథంగా వైభవోపేతంగా , రాజలాంఛనాలతో,మహాత్ములతో,సాధు పురుషులతో,భక్తులతో,దివ్య లీలలతో జరుగుచున్నవి.

శ్రీస్వామివారికిఅనేకమందిభక్తులు,సేవకులు కలరు.శిష్యుడు దుర్గా ప్రకాష్ దేవర ఒక్కరే.

శ్రీశ్రీశ్రీ కృష్ణ పరమహంసస్వామివారు 1996 జనవరి 1వ తేదీ వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినాన ప్రధాన భక్తుల సమావేశంలో,భక్తులందరి కోరిక మేరకు దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందించారు.శిష్యుడైన దేవర గారు సన్యాసం ఇమ్మని కోరగా నీవు రాజయోగివి,రాజయోగిగా జీవిస్తూ ఈ పీఠమునకు నా తరువాత వారసునిగా ఉండమని,స్వామి తన దేహ సంస్కార భాద్యతను భక్తుల సమక్షంలో అనుగ్రహించారు.(దేహ సంస్కార భాద్యత అనగా దేహానికి అగ్ని సంస్కారము చేయుట,ఆస్తికల పైన నవపాషాణ సహితంగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రాతిష్ఠ చేయుట)ఈ ఆశ్రమం ప్రపంచాన్ని,లోకాన్ని సుభిక్షం చేస్తుందని చెప్పారు. భక్తులందరూ స్వామివారి ఆశ్రమానికి సేవలు అంధిస్తామని ప్రమాణం చేశారు.

మనం పురాణాలద్వారా చదివినది,పెద్దల ద్వారా విన్నది గురు బ్రహ్మ,గురు విష్ణు,గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః అన్నట్లుగా గురు అనుగ్రహంతో లలాట లిఖితాన్ని తప్పించినట్లు శ్రీశంకరాచార్యులు కథ వలన తెలుస్తుంది.సామాన్య జీవనం సాగిస్తూ,శ్రీరామకృష్ణ వివేకానంద ఆశయాలను ప్రచారం చేస్తూ,సేవ,భక్తి అనే మూల సూత్రాలతో జీవిస్తున్నటువంటి వానికి గురువు అయిన శ్రీశ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామి వారు తన అనుగ్రహంతో అతని నుదుట రాతను మార్చి ఒక పీఠాధిపతిగా రాజయోగిగా,గురువుగా,శ్రీ శారదా విద్యా పీఠాధిపతిగా మార్చబడిన వ్యక్తి శ్రీ దుర్గా ప్రకాష్ దేవర.

సజ్జనసాధుసేవాభాగ్యం చాలా గొప్పదని సాధుదర్శనం పాపనాశనం,సాధుసేవ పుణ్యము,సాధు సంభాషణ కోటి తీర్ధముల సేవన ఫలము,సాధు పాద నమస్కారము మోక్షము అని తెలుసుకున్నటువంటి దుర్గాప్రకాశ్ దేవర 1982 నుండి స్వామి వారిని సేవించటం జరిగినది.దత్తాత్రేయ స్వామి శిష్యులను పరీక్షించినట్టుగా శ్రీ స్వామివారు 7సం||రాలు అనేక పరీక్షలు పెట్టిన తరువాత శిష్యునిగా స్వీకరించి యోగము శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారి పూజ,ఉపాసనావిధానంలో శిక్షణ ఇచ్చినారు.శ్రీ రామకృష్ణ పరమహంస స్వామికి తోతాపురి,బ్రాహ్మణ భైరవీలు భక్తి,యోగములలో శిక్షణ ఇచ్చినట్లుగా దుర్గా ప్రసాద్ దేవర గారికి శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు శ్రీవిద్యాపాసన విధానమును అనుగ్రహించినారు.శ్రీచక్ర యంత్రం,శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అరవణ స్వర్ణ యంత్రమును,లోక కళ్యాణర్ధమైన తల్లి,బిడ్డలను పూజించుటకు సంక్రాంతి పర్వదినాన శ్రీశ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామివారి శిష్యునికి పరిపూర్ణ అనుగ్రహంతో ఆశీర్వదించారు